Thursday, April 25, 2024

అతి విశ్వాసంలో టీడీపీ.. అస‌లుకే మోసం వ‌స్తుందా?

అధికారంలోకి వ‌చ్చేస్తున్నామ‌న్న అతి విశ్వాసంలో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తీసుకుంటున్న‌ నిర్ణ‌యాలు ఆ పార్టీ మూలాలను దెబ్బ‌తిస్తున్నాయా? పార్టీ ఆవిర్భావం నుంచి వెంట ఉంటున్న సీనియ‌ర్ నాయ‌కుల‌ను కాద‌ని, ఇత‌ర పార్టీల‌నుంచి, ఆర్థికంగా బ‌ల‌వంతులుగా ఉన్న‌వారిని ఎంపిక చేయ‌డం గెలిచే స్థానాల‌పై ప్ర‌భావం చూప‌నుందా? టికెట్ల కేటాయింపున‌కు పార్టీ విధేయ‌త‌, ఈ ఐదేళ్ల క‌ష్ట‌కాలంలో పార్టీని బ‌తికించుకున్న వారిని కాద‌ని, ఖ‌ర్చుపెట్టే స్థోమ‌త‌ను ప్ర‌ధాన అర్హ‌త‌గా చూసే సంస్కృతి టీడీపీలో ఈసారి మునుపెన్న‌డూ లేనంత‌గా పెరిగిందా? డ‌బ్బు సంచులు పెట్టి పార్టీలో గెలిచిన‌వారికి, అవే డ‌బ్బు సంచులు ఆశ చూపితే ఉంటార‌న్న గ్యారంటీ ఉందా? 40 ఏళ్ల రాజ‌కీయ కురువృద్ధుడు చంద్ర‌బాబుకు ఇవేవీ తెలియ‌వా? తెలిసినా లోకేశ్ ఫార్ములాను త‌ప్ప‌ని చెప్ప‌లేని నిస్స‌హాయ‌త‌లో ఉన్నారా? ఏం జ‌రుగుతోంది ఏపీ టీడీపీలో!

ఏపీలో చంద్ర‌బాబునాయుడు అరెస్టు త‌రువాత ఆ పార్టీకి ప్ర‌జ‌ల్లో తెలియ‌నంత ఊపు పెరుగుతూ వ‌చ్చింది. దానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ తోడు కావ‌డంతో మ‌రింత బ‌లం పెరిగింది. ఈ రెండు పార్టీల పొత్తుతో 2024 ఎన్నిక‌ల్లో టిడిపి, జ‌న‌సేన ప్ర‌భుత్వం ఖాయ‌మ‌న్న ప్ర‌చారం ఏపీవ్యాప్తంగా జోరందుకుంది. జాతీయ స‌ర్వేలు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి. దీంతో ఏపీ టీడీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నారా లోకేశ్‌, ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌నిచేస్తున్న రాబిన్ శ‌ర్మ టీం అతివిశ్వాసంలోకి వెళ్లిన‌ట్లు క‌నిపిస్తోంది. పార్టీలో సుదీర్ఘ‌కాలం కొన‌సాగుతున్న నాయ‌కుల‌కు విలువ త‌గ్గించేశార‌న్న ఆవేద‌న ప‌లువురు సీనియ‌ర్ల‌లో క‌నిపిస్తోంది. పార్టీ విధేయ‌త‌, న‌మ్మ‌కం, క్ర‌మ‌శిక్ష‌ణ‌ను కాద‌ని ఆర్థిక స్థోమ‌త‌పేరుతో ప‌లుచోట్ల కొత్త‌ముఖాల‌కు, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన‌వారికి పెద్ద‌పీట వేస్తుండ‌టంతో ఆ పార్టీ మూలాలు దెబ్బ‌తినే ప‌రిస్థితి వ‌స్తోంది.

రాయ‌ల‌సీమ జిల్లాల విష‌యానికి వ‌స్తే రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గంలో ఎప్ప‌టినుంచో రెడ్డ‌ప్ప‌గారి కుటుంబం టీడీపీకి పెద్ద దిక్కుగా ఉంది. దివంగ‌త రాజ‌గోపాల్ రెడ్డి హ‌యాం నుంచి క‌డ‌ప జిల్లాలో టీడీపీ కోసం నిల‌బ‌డింది. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌వాలోనేకాదు, వైఎస్ జ‌గ‌న్ నిర్బంధంలోనూ ఆ కుటుంబానికి చెందిన ర‌మేష్‌రెడ్డి టీడీపీలో కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం రాయ‌చోటి నియోజ‌వ‌క‌ర్గానికి ఆయ‌నే ఇన్‌చార్జ్‌ కూడా. లోకేశ్ పాద‌యాత్ర‌తో సహా ఈ ఐదేళ్లు పార్టీ కార్య‌క్ర‌మాల‌న్నీ ఆయ‌న చేతినుంచి ఖ‌ర్చుపెట్టే చేసుకుంటూ వ‌చ్చారు. రాయ‌చోటి నుంచి రాంప్ర‌సాద్‌రెడ్డి రెండేళ్ల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరితే, రెండు నెల‌ల క్రితం వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి బంధువు ద్వార‌కానాథ్‌రెడ్డి పార్టీలో చేరారు. తీరా టికెట్ మాత్రం రాంప్ర‌సాద్‌రెడ్డికి కేటాయించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌మేశ్‌రెడ్డికి పార్టీ నేత‌లు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో ఆయ‌న భవిష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ర‌మేష్‌రెడ్డికి టికెట్ లేదు అని చెప్పే స‌మ‌యంలో పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆయ‌న‌కు ఏదైనా ప‌ద‌వి ఇస్తామ‌న్న విష‌యంకానీ, బుజ్జ‌గింపు ధోర‌ణి కాని క‌న‌బ‌డ‌టం లేదని ర‌మేష్‌రెడ్డి అనుచ‌రుల‌తో వాపోయిన‌ట్లు చెబుతున్నారు. ఆయ‌న ఇండిపెండెంట్‌గా పోటీ చేసే యోచ‌న‌లో ఉన్నార‌ని, లేదంటే కాంగ్రెస్ లేదా వైసీపీలో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ఇదే జ‌రిగితే ఆ సీటు టీడీపీ కోల్పోయిన‌ట్లే.

రాయ‌ల‌సీమ టీడీపీ వ్య‌వ‌హారాలు లోకేశ్ త‌ర‌ఫున చేస్తున్న బీదా ర‌విచంద్ర‌యాద‌వ్.. ఇలా ప‌లువురు సీనియ‌ర్ నేత‌లను త‌న వ‌ద్ద‌కు పిలిపించుకోవ‌డం, డ‌బ్బు ఎంత ఖ‌ర్చు పెట్ట‌గ‌ల‌రు? అని ప్ర‌శ్నించ‌డం, వారు సంతృప్తిక‌ర‌మైన స‌మాధానం చెబితే, పార్టీ వ‌ద్ద డిపాజిట్ చేయ‌మని అడ‌గ‌డం లేదంటే ఇంకో అభ్య‌ర్థిని పిలిచి ఇదే బేరం పెట్ట‌డం రివాజుగా మారింద‌నే విమ‌ర్శ‌లు గుప్పుమంటున్నాయి. ఇదే అనుభ‌వం క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సాయినాధ్‌శ‌ర్మ‌, ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన లింగారెడ్డి, మైద‌కూరు నుంచి రెడ్యం వెంక‌ట‌సుబ్బారెడ్డిలకు ఎదురుకావ‌డంతో వారంతా త్వ‌ర‌లో వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇక శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డికి మ‌రో అనుభ‌వం. 25 ఏళ్లుగా టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడు. పార్టీ ఫండుతో నిమిత్తం లేకుండా ఎన్నిక‌లు ఖ‌ర్చుపెట్టుకుంటూ వ‌స్తున్నారు. ఈ ఐదేళ్లపాటు సొంత డ‌బ్బుల‌తో పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ వ‌చ్చారు. వైసీపీ నేత‌ల‌తో ఢీ అంటే ఢీ అన్నారు. కేసులు పెట్టించుకున్నారు. ఇప్పుడు ఆయ‌న పోటీచేసే పుట్ట‌ప‌ర్తి స్థానాన్ని క‌డ‌ప జిల్లాకు చెందిన పోలీసు అధికారికి కేటాయించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బీసీ పేరుతో ఒక నాన్ లోక‌ల్ బీసీని తెచ్చి అక్క‌డ పోటీ చేయిస్తే ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఏ ప‌రిస్థితుల్లోనూ టీడీపీ గెల‌వ‌డానికి ప‌నిచేయ‌రు. పుట్ట‌ప‌ర్తిలో వైసీపీ సీటు రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి ఇచ్చారు. అలాంటి చోట నాన్ లోక‌ల్ బీసీని, అదీ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ నాయ‌కుల‌ను కూడా గుర్తు ప‌ట్ట‌లేని వ్య‌క్తిని తెచ్చి పోటీలో దింపితే, న‌ష్ట‌పోయేది టీడీపీ సీటే అన్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఈ ఆర్థిక స్థోమ‌త కేట‌గిరిలో పాస్ మార్కులు కోల్పోయిన నాయ‌కుల జాబితాలో క‌ర్నూలు నుంచి గౌరు చ‌రిత కుటుంబం కూడా చేరిందంటున్నారు. నంద్యాల ఎంపీ టికెట్ కోసం బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమార్తెను కూడా స్థోమ‌త ప‌రీక్ష‌కు హాజరుక‌మ్మ‌ని చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆంధ్ర‌, ఉత్త‌రాంధ్ర‌లోనూ ఇదే స్థితి!

ఆంధ్ర‌, ఉత్త‌రాంధ్ర‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొన‌డంతో పార్టీ సీనియ‌ర్లు, నిజాయితీప‌రులు, అక్ర‌మాలు చేసి సంపాయించలేనివారు పోటీకి దూరం ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొందనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇదే విష‌యాన్ని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇత‌ర పొలిట్ బ్యూరో స‌భ్యుల వ‌ద్ద ఏక‌ర‌వు పెడుతున్న నేత‌ల‌కు .. ”లోకేశ్ వ‌చ్చాక పార్టీ విధానాలు భారీగా మారిపోయాయి బ్ర‌ద‌ర్‌.. వుయ్ ఆర్ హెల్ప్‌లెస్‌..” అంటూ స‌మాధానం వినిపిస్తోంద‌ట‌. నూజివీడు నుంచి మ‌ద్రబోయిన‌, మ‌చిలీప‌ట్ట‌ణం నుంచి కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ల‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్లు వైసీపీ బాట ప‌డుతున్నార‌ని స‌మాచారం. తెలుగుదేశం పార్టీ ఇలాగే ముందుకుపోతే ఓట‌మి చెందినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌ని, అతివిశ్వాసంతో లోకేశ్ టీం చేస్తున్న అరాచ‌కాన్ని స‌హించ‌క చాలాచోట్ల టీడీపీ నేత‌లు లోపాయికారిగా వైసీపీకి ఓట్లు వేయించి మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డానికి స‌హ‌క‌రించినా ఆశ్చ‌ర్యం లేద‌ని పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఒక స‌ర్వే సంస్థ య‌జ‌మాని వ్యాఖ్యానించారు.

అభ్య‌ర్థి ఎవ‌రో తేల్చ‌కుండా ఒక‌టే కార్య‌క్ర‌మాలు..

నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు పోటీ చేస్తారో తెలియ‌కుండా.. ఒక‌వైపు లోకేశ్‌, మ‌రోవైపు చంద్ర‌బాబు, ఇంకోవైపు భువనేశ్వ‌రి పార్టీ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. దీంతో ఇన్‌చార్జ్‌ల‌కు ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతోంది. పాద‌యాత్ర ముగిసింద‌నుకునేలోపే లోకేశ్ మ‌ళ్లీ ఉత్త‌రాంధ్ర శంఖారావం యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న ఒక్క శంఖారావం యాత్ర ఖ‌ర్చు రెండు కోట్ల‌కు పైమాటే అంటున్నారు. ఇదంతా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులే భ‌రించాలి. పోనీ వారికి టికెట్ ఇస్తార‌న్న గ్యారంటీ ఉందా అంటే అదీ లేదు. ఈ ప‌రిస్థితిని త‌ల‌చుకుని టీడీపీ నేత‌లు కుమిలిపోతున్నారు. ఐదేళ్లు అప్పోసప్పో చేసి పార్టీని న‌డిపించిన‌వారికి ఇంకేదైనా పార్టీ ప‌దవి ఇస్తామ‌ని ఒప్పించి, బుజ్జ‌గించి ఇత‌రుల‌కు సీటు కేటాయించాల్సిన వారు, ముక్త‌స‌రిగా మీకు టికెట్ లేద‌ని చెప్పి పంపిస్తుండ‌టంతో వారి ఇగో హ‌ర్ట్ అవుతోంద‌ని, వారంతా ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి వెనుకాడ‌ర‌ని కూడా చెబుతున్నారు.

ఎంపీ సీటు ఫ‌ర్ సేల్‌!

టీడీపీలో ఎమ్మెల్యే సీట్ల వ్య‌వ‌హారం ఇలా ఉంటే, ఒక ఎంపీ సీట్ల‌ను ఏకంగా వంద‌కోట్లు చూపించు, ఎంపీ సీటు కొట్టు అంటున్నార‌ని ప్ర‌చారం రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా జ‌రుగుతోంది. పార్టీతో ప‌నిలేదు, విధేయుడా కాదా? అన్నది అప్రస్తుతం, గ‌తంలో టీడీపీ క్యాడ‌ర్‌ను ఏ ర‌కంగా ఏడిపించారు అన్న‌ది అస‌లే ప్రామాణికం కాదు.. కేవ‌లం వంద కోట్లు ఉన్నాయా? చూపించు, బీఫాం తీసుకెళ్దువు ట‌చ్‌లో ఉండు… అన్న బేరం సాగుతోంద‌ని వాపోతున్నారు. లోకేశ్ నాయ‌క‌త్వంలో, రాబిన్ శ‌ర్మ డైరెక్ష‌న్‌లో పార్టీలో కొత్త సంస్కృతి పుట్టింద‌ని, ఇది అర‌కొర సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు కానీ దాని మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌ద‌ని అంటున్నారు.

Related Articles

Latest Articles