
లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగిన 95వ అకాడమీ వేడుకలలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోసు ఈ అవార్డు అందుకున్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటునాటు’ పాటను సంగీత దర్శకుడు కీరవాణి కంపోజ్ చేశారు. గేయ రచయిత చంద్రబోస్ ఈ పాటను రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ గాత్రంతో ఈ పాటకు ఊపు తెచ్చారు.
ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ స్టెప్పులతో పాటను మరో లెవల్‌కు తీసుకెళ్లారని చెప్పవచ్చు.
ఒరిజినల్ సాంగ్ విభాగంలో..
ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాలుగు పాటలు పోటీ పడ్డాయి. నాలుగు పాటలు నామినేట్ అయినట్లు జనవరి 24న అకాడమీ ప్రకటించింది.
వీటిల్లో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాటతో పాటుగా ‘టెల్ ఇట్ లైక్ ఎ విమెన్’ నుంచి అప్లాజ్, టాప్ గన్;మావ్ రిక్ సినిమా నుంచి హోల్డ్ మై హ్యాండ్ పాట, బ్లాక్ పాంథర్;వకండా నుంచి లిఫ్ట్ మీ అప్ పాటలున్నాయి.
మిగిలిన మూడు పాటలను వెనక్కి నెట్టి ఆర్ఆర్ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట అకాడమీ అవార్డు సొంతం చేసుకుంది.