ఎస్టీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని అత్యంత ధనవంతులను ఎస్టీ జాబితాలో చేర్చడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదైనా తీర్మానం చేసేముందు సభలో చర్చ జరగాల్సి ఉన్నా సభలో అటువంటిదేదీ జరగకుండానే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను కలపడం సరికాదు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా అరకు మండలం మాడగడ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ తీర్మానంలో పేర్కొన్నది. బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో ఇటీవల వైయస్సార్సీపీ ప్రభుత్వం తీర్మానించి కేంద్రానికి పంపించింది. తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు రాయలసీమలో ఉండే బోయ, వాల్మీకులు కర్నాటకలో ఎస్టీ జాబితాలో ఉంటున్నారని, ఇక్కడ మాత్రం తమకు అన్యాయం జరుగుతుందని ఆయా వర్గాలు వారు తనకు తెలియజేశారని అసెంబ్లీలో ఈ తీర్మానం ప్రవేశ పెట్టే సమయంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. తాను పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చాను కాబట్టి ఈ హామీని నెరవేరుస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఆయన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం మాడగడ పంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఈ సందర్భంగా వైయస్సార్సీపీ నాయకులు, ఆ పంచాయతీ సర్పంచ్ జ్యోతి భర్త ఎం. బాలాజీ మాట్లాడుతూ ఎస్టీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని అత్యంత ధనవంతులను ఎస్టీ జాబితాలో చేర్చడం అనేది సరైన పద్ధతి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా తీర్మానం చేసేముందు సభలో చర్చ జరగాల్సి ఉన్నా సభలో అటువంటిదేదీ జరగకుండానే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను కలపడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
