
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చారని పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారు అన్నారు. జి. మాడుగుల మండలం వంజరి -2 గ్రామ సచివాలయం పరిధిలోని మర్రిపాలెం, వెన్నెల కోట, కినగరి గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 130 గడపలను సందర్శించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడపకు తిరుగుతూ ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ అందజేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అర్హత ఉండి ఇప్పటికీ సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే స్థానిక గ్రామ సచివాలయంలో సంప్రదించి సంక్షేమ పథకాలు ఎలా పొందాన్న దానిపై కూడా వివరించారు. ఆయా గ్రామాల ప్రజలు వంతెనలు లేక పడుతున్న ఇబ్బందులను భాగ్యలక్ష్మి గారు స్వయంగా పరిశీలించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న కర్రల వంతెనలపై నడిచి సంబంధించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జగనన్న దయవల్లే గిరిజనులు ఎదుర్కొంటోన్న కష్టాలను తెలుసుకోగలుగుతున్నానని భాగ్యలక్ష్మి గారు అన్నారు. తాను వాస్తవంగా ఎన్నికల సమయంలో కూడా ఇలా గ్రామ గ్రామాన, గడప గడపకూ తిరగలేదని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులు ఇలా తిరిగి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం అనేది ఆంధ్రప్రదేశ్‌లోనే సాధ్యమైందన్నారు.
పేదరికమే ప్రామాణికంగా తీసుకొని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల మంజూరు చేయడం తమ ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులు ఖాతాలకు జమవుతుండడం చారిత్రాత్మకమని తెలిపారు. గిరిజన ప్రాంతంలో తాను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన గ్రామాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొర్ర రవీనా, ఎంపీటీసీ వంతల మధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నుర్మని మత్స్య కొండం నాయుడు, వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు సురభి రామకృష్ణ, సర్పంచ్ కొండబాబు, గెమ్మిలి సచివాలయం కన్వీనర్ బి బాలయ్య పడాల్, మండల కన్వీనర్ లంకెల కళ్యాణ్, సచివాలయం కన్వీనర్ మత్స్యకొండం, సొలభం ఎంపీటీసీ కూడ సన్యాసిరావు, జి. మాడుగుల సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మణ్, నాయకులు సుమర్ల సన్యాసిరావు, వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది , వాలంటీర్లు పాల్గొన్నారు.




