
టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర
గిరిజన సంపదను దోచుకోవడానికి కుంభా రవిబాబు జగన్ తన బనామిగా నియమించారు అఖిలపక్షం ఆరోపణ
నిమ్మలపాడులో కాల్సెట్ మైనింగ్ తవ్వకం నిలిపేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు నిరసన
మైనింగ్ కి వెళ్లే రహదారిపై రాళ్లతో అడ్డ గోడ నిర్మించిన గ్రామస్తులు
ఖబడ్దార్ కుంభా రవి బాబు.. ఖబడ్డార్ ఇక నుంచి కాల్సైట్ మైనింగ్ తవ్వడానికి వస్తే మీ అంత చూస్తాం… మాకు జరిగిన అన్యాయం గురించి చెప్పిన పాంగి రవీంద్రను తిరిగి ఉద్యోగం నుంచి తొలగిస్తారా? అనే నినాదాలతో అనంతగిరి మండలం నిమ్మలపాడు మారుమ్రోగింది. కాల్సైట్ గనులు తవ్వకాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అరకు నియోజకవర్గ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామం నుంచి కాల్సైట్ గనుల వరకు పాదయాత్ర నిర్వహించిన అఖిలపక్ష నాయకులు అనంతరం ఆ గనుల తవ్వకాలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల స్వయంగా కాల్సైట్ గనులకు వెళ్లే రహదారిపై రాళ్లతో అడ్డంగా గోడను నిర్మించారు. గో బ్యాక్ ఏపీఎండిసి అంటూ ఆ రాళ్ల గోడపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంపాదన దోచుకోవడానికి కుంభా రవి ఇక్కడ పదవులను కట్టబెట్టి తన బినామీగా నియమించుకున్నారని ఆరోపించారు. గనులు తవ్వకం జగనే ప్రత్యక్షంగా చేస్తున్నారని అది కుంభా రవి ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు.
చట్టాలకు విరుద్ధంగా మైనింగ్ తవ్వకం

ఎప్పుడైనా గిరిజన గ్రామాలలో ఉన్న మైనింగ్ తవ్వకం చేపట్టాలంటే స్థానిక పంచాయతీ పాలకవర్గం అనుమతించాలని అప్పుడే తవ్వకాలు చేపట్టాలని సివేరు దొన్నుదొర అన్నారు. కానీ పీసా చట్టాలకు విరుద్ధంగా నిమ్మలపాడులో కాల్సైట్ గనులు తవ్వుకు పోతున్నారని అన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోటి 40 లక్షల చెస్ కూడా చెల్లించకుండా అత్యంత దుర్మార్గంగా గిరిజన సంపదను వైయస్ జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు గ్రామపంచాయతీ కి గాని ఇక్కడ ప్రజలకు గాని చట్టప్రకారం రావాల్సినటువంటి పనులు కూడా చెల్లించకుండా తరలిస్తున్న కాల్సైట్ గనులను ఇక నుంచి తవ్వేందుకు అవకాశం ఇవ్వబోమని హెచ్చరించారు. గనులు తవ్వడానికి ఇక నుంచి ఎవరొచ్చినా వాళ్ళ అంతు చూస్తామని చెప్పారు.
అందుకేనా కుంభా రవి బాబుకి పదవులు ఇచ్చారు

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారని సివేరి దొన్నుదొర ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంపదలను దోచుకోవడానికి స్థానికేతురుడైన కుంభా రవి బాబుకి జగన్ మోహన్ రెడ్డి పదవులను కట్టబెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. గుంటూరుకు చెందిన కుంభా రవిబాబుకు అల్లూరి జిల్లాలో పని ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. కాల్సైట్ గనులను దోచుకుపోతున్నది కుంభా రవిబాబేనని ఈయన వెనకున్నది సీఎం జగన్ అని తెలిపారు. కుంభా రవిబాబు జగన్మోహన్ రెడ్డికి బినామీ అని అందుకే ఈ ప్రాంతంతో సంబంధం లేకపోయినా ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చారని ఇప్పుడు ఆ పదవి ముగియక ముందే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మన ప్రాంతం వైపు వదిలారని అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అటవీ సంపదను దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక రచించారని దానికి కుంభా రవిబాబు ఇక్కడుండి అన్ని వ్యవహారాలు చూస్తున్నారని అన్నారు. ఇకనుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన సంపదను దోచుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
పాంగి రవీంద్రను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

కుంభా రవిబాబు చేస్తున్న గనుల దోపిడీని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్న దురుద్దేశంతో ఏపీఎండిసిలో ట్రైనీగా ఉద్యోగం చేసుకుంటున్న ఎగువ శోభకు చెందిన పాంగి రవీంద్రను కక్షపూరితంగా విధుల నుంచి తొలగించారని సివేరి దొన్నుదొర పేర్కొన్నారు. కుంభారవి బాబు నిజమైన గిరిజనడైతే సాటి గిరిజనుడైన పాంగి రవీంద్రకు ఇలాంటి అన్యాయం చేసి ఉండేవాడా? అని ఆయన ప్రశ్నించారు. ఆయన స్థానికేతరుడు కాబట్టే అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరిగినా తన పట్టించుకోడని దానికి పాంకి రవీంద్రే సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆయన తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేకపోతే తీవ్ర స్థాయిలో నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇక్కడ కాల్సైట్ గనులను నిలుపుదల చేయాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. అధికారులు స్పందించకపోవడం వల్లే ఈరోజు అఖిలపక్షం వచ్చి ఇక్కడ నిరసన తెలిపాల్సిన అవసరం ఏర్పడిందని ఇకనైనా తవ్వకం నిలుపుదల చేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పాంగి రాజారావు (బిజెపి), మురళి (జనసేన), బురిడీ డేవిడ్ (కాంగ్రెస్( తదితరులు పాల్గొన్నారు.


