
టిడిపి దళిత ఎమ్మెల్యే స్వామిపై దాడిని ఖండిస్తూ
అరకులో దొన్నుదొర ఆధ్వర్యంలో టిడిపి నేతల నిరసన
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన టీడీపీ నేతలు
అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ దళిత శాసనసభ్యుడు డోలా వీరాంజనేయ స్వామిపై దాడి చేయడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ నాయకులు మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్నుదొర గారు మాట్లాడుతూ జీవో.1ని రద్దు చేయాలని.. అప్రజస్వామికంగా తీసుకొచ్చిన ఈ చీకటి జీవోను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదని స్పీకర్ ను కోరిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు రౌడీయిజం చేయడం సరికాదని చెప్పారు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు వైసిపి నేతలు చేస్తుండడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రజా సమస్యల ప్రస్తావించలేనప్పుడు ఆ సభ నిర్వహణ దేనికోసమని ఆయన నిలదీశారు. శాసనసభ్యుల హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్న స్పీకర్ తీరు మార్చుకోవాలని సూచించారు. ఏ సామాజిక వర్గం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వారిని వైసీపీలో ఉన్న అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో తిట్టిస్తూ…జగన్‌మోహన్ మెహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. టీడీపీ దళిత ఎమ్మెల్యే మరో వైసీపీ దళిత ఎమ్మెల్యే చేత తిట్లు తిట్టించడం, భౌతిక దాడులు చేయించడమే దీనికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ప్రజాక్షేత్రంలో సరైన తీర్పుతో బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఉండే గౌరవ సభలో ప్రతిపక్షాలకు చెందిన సభ్యులపై దాడి చేయడం సహేతుకం కాదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు, జిల్లా ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అమ్మన్న, టిడిపి నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.