ఆధిపత్యం కోసమే అంతర్యుద్ధమా..!

Spread the love

సంస్ధాగత పటిష్టత లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్ దాపురిస్తుందేమోననిపించే పరిస్ధితులు నెలకొంటున్నాయి…ఎంత పని ఉన్నా…ఎన్నికలు ముగిసి…కోర్టు తీర్పుతో ఊహించని రీతిలో “స్ధానిక” విజయాన్ని ఖాతాలో వేసుకోవడంతో పాటు పదవీ ప్రమాణ కార్యక్రమాలలో మునిగి తేలుతున్నా…పార్టీ పరమైన అంశాల్లో నాన్పుడు ధోరణి ఉంటే అది కనిపించని చెరుపు చేస్తుంది… పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో పార్టీలో అసంతృప్తులుంటే వెంటనే పసిగట్టే యంత్రాంగం స్తబ్ధుగా ఉంటే రాజమహేంద్ర వరం సంఘటనలు ఇతర చోట్ల కూడా పడగవిప్పే ప్రమాదం ఉంది…పోనీ స్పర్ధలున్నది పార్టీలో ఏ కింది స్ధాయి నేతలదో కాదు రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి-రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ ల మధ్య భగ్గుమంటున్న అంశం… ఎవరు ఎవరినన్నారని కాదు…ఒకే పార్టీలో ఉంటూ ఒకరికొకరు వీధికెక్కడమేనా లేక పార్టీ పరంగా అంతర్గతంగా తేల్చుకునే ధోరణి ఉండదా అంటూ సామాన్యజనం గొణుక్కుంటున్నారు…రాష్ట్రంలో పాలనా పరంగా బాగున్నా…పార్టీ పరంగా సిగపట్లు వస్తుంటే పోరు తీర్చలేని యంత్రాంగం పార్టీలో లేకుంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు…ముఖ్యమంత్రి జగన్ అధికారంలో లేనపుడు సాధారణ ప్రజా ప్రతినిధిగా ఉన్న వేళ ప్రత్యర్ధులు కేసులతో విసిగించి సీబీఐని ఉసిగొల్పి ముప్పుతిప్పలు పెట్టారు… ఇందుకు అప్పటి సీబీఐజేడీ లక్ష్మీ నారాయణను సర్వవిధాలా ఉపయోగించుకుని పబ్బం గడుపుకొన్నారు కొందరు…అదే లక్ష్మీనారాయణ తప్పు తెలుసుకున్నందునో ఏమో ఉద్యోగం వదిలేసి రాజకీయాలలో చేరేందుకు దారులు వెదికి జనసేనకు వెళ్లి అక్కడ ఇమడలేక వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారనే వార్తలు హల్చల్ చేయడం…జగన్ ఆయనను చేర్చుకునేందుకు తిరస్కరించారనడం కూడా అంతే స్ధాయిలో ప్రచారం జరిగింది…నిజానిజాలు పక్కన పెడితే ఆయనగారు ఇప్పుడు తూర్పు గోదావరి లోని ధర్మవరం గ్రామంలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకోవడం అంతటి వ్యక్తికి విపరిణామమే…అలాంటి జేడీ లక్ష్మీనారాయణతో రాజమహేంద్రి ఎంపీ సెల్ఫీకి ఎగబడ్డారనే(దిగారానే) అభియోగం తదితరాలతో రాజానగరం ఎంఎల్ఏ టార్గెట్ చేసి విరుచుకు పడటమే కాదు పార్టీలో మరో ఆర్ఆర్ఆర్ అంటూ బిరుదు కూడా ఇవ్వడం పార్టీలో వివాదాస్పదంగా తయారైంది…ఈ ఆరోపణలు సోమవారం తారాస్ధాయిలో అధికార పార్టీకి తాకగా ప్రత్యామ్నాయంగా ఎంపీ ఏం చేస్తారోననే ఉత్సాహం ప్రత్యర్ధి పార్టీల్లో నెలకొన్న వేళ సింపుల్ గా ఆధారాలుంటే బయట పెట్టాలనీ…కుమ్మక్కు రాజకీయాలు తనకు చేతకావనీ…మంగళవారం నాటి సమావేశంలో ఖండించుకున్నారు…ఆరోపణల్లో పసలేదని కూడా తేల్చేశారు…ఏదిఏమైనా ఇప్పుడిదో చోద్యంగా…కాలక్షేపంగా పార్టీలోని అంతర్గత గ్రూపుల్లో వేడుకగా మారింది…ప్రధాన నాయకుల్లో ఒకరైన జక్కంపూడి కాపు సామాజిక వర్గానికి చెందినవారైతే…ఎంపీ భరత్ గౌడ సామాజిక వర్గం వారు…దీంతో ఈ మాటల యుద్ధం రెండు సామాజికవర్గాల మధ్య పోరుగా పరిణమిస్తుందనే వారు లేకపోలేదు…జిల్లా స్ధాయిలో పార్టీకి అధిష్టానం అంటూ లేక పార్లమెంటరీ స్ధాయికి హోదా కాస్తా మెట్టుదిగడం…పోరు సల్పే రెండు దిగ్గజాలకు హితబోధ చేసే స్ధాయిలో నాయకులు లేకపోవడం వెరసి బ్రోచేవారెవరురా…చెప్పేవారెవరురా అనుకుంటూ నిత్యం అధికార కార్యకలాపాలలో తలమునకలయ్యే ముఖ్యమంత్రికి ఈ తలపోటు చేరక తప్పేలా లేదనేవారూ లేకపోలేదు…స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సర్వం కోల్పోయిన తెలుగుదేశం ను చూసి వైసీపీ శ్రేణులు పండుగ చేసుకోవాలో… రాజమహేంద్రి పరిధిలో పార్టీలోని అంతర్గత ఆవేశ కావేషాలు చూసి దుఃఖితులవ్వాలో తెలియక మౌనం వహిస్తున్నామంటూ కేడర్ వాపోతోంది…ఇదంతా ఆధిపత్య పోరులో భాగమేనని కూడా భావిస్తోంది… పార్టీలో ఇలాంటి పోకడలను ఎక్కడ తలెత్తినా అక్కడికక్కడ తుంచడం లేదా పరిష్కరించే దిశగా పెద్దరికం వహించే యంత్రాంగం అన్నిచోట్లా అవసరమని లేకుంటే వెంటనే కట్టడి చేసే కీ హోల్ స్ధాయి వ్యక్తులు గంటల వ్యవధిలో హాజరై పరిష్కరించేలా సన్నద్ధం కావడం అవశ్యంగా చెబుతున్నారు…

చంద్రశేఖర్ తెంపల్లె…సీనియర్ జర్నలిస్ట్…కాకినాడ (ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన క‌థ‌నం)

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *