మినుముల కొండా పాత్రుడు క‌న్నుమూత‌

Spread the love

సౌమ్యుడు… మిత‌స్వ‌భావి…మినుములూరు మాజీ స‌ర్పంచ్ మినుముల కొండా పాత్రుడు(68) మంగ‌ళ‌వారం సాయంత్రం క‌న్నుమూశారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌నకు మంగ‌ళ‌వారం సాయంత్రం బ్రెయిన్ స్ట్రోక్ గుర‌య్యారు. దీంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం కాస్త అనారోగ్యానికి గురైన వెంట‌నే విశాఖ‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందారు. బ్ర‌యిన్‌కు సంబంధించిన స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైన‌ట్టు వైద్యులు గుర్తించి చికిత్స చేసిన అనంత‌రం ఇంటివద్దే విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. దీంతో ఆయ‌న ఇంటి వ‌ద్దే ఉంటున్నారు. మంగ‌ళ‌వారం వ‌ర‌కూ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్నా అక‌స్మాత్తుగా ఆరోజు సాయంత్రం బ్రెయిన్ స్ట్రోక్‌కు గుర‌య్యారు. ఈ రోజు 11 గంట‌ల‌కు మినుమూరు గ్రామంలో ఆయ‌న పార్ధివ‌దేహానికి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు.

సౌమ్యుడు..అంద‌రికీ మిత్రుడు
కొండా పాత్రుడు అత్యంత సౌమ్యుడు. నిగ‌ర్వి. త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఎంతోమంది మిత్రుల‌ను సంపాదించుకున్నారు. మాజీ మంత్రి మ‌త్స్య‌రాస మ‌ణికుమారి, మ‌త్స్యారాస వెంక‌ట‌రాజు,మాజీ ఎంపీ మిడియం బాబురావు, మాజీ ఎమ్మెల్యేలు గొడ్డేటి దేముడు, కొట్టుగుళ్లి చిట్టినాయుడుతో ఆయ‌న క‌ల‌సి ప‌ని చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం జీసీసీ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతున్నారు. మినుములూరుకు మూడు ద‌ఫాలు స‌ర్పంచ్‌గా సేవ‌లందించారు. త‌నకు జ‌న్మ‌నిచ్చిన గ్రామ అభివృద్ధి కోసం కొండా పాత్రుడు నిరంత‌రం ఆలోచిస్తూ ఉండేవారు. త‌న రాజ‌కీయ జీవితంలో సాధ్య‌మైనంత వ‌ర‌కూ గ్రామంలో పార్టీల‌తో సంబంధం లేకుండా అభివృద్ధి ఫ‌లాలు అందించడానికి కృషి చేశారు. ఆగ్రామంలో పీహెచ్‌సీ ఏర్పాటుకు కూడా కృషి చేశారు.

మోద‌కొండ‌మ్మ‌కు సేవ‌కులు
ఉత్త‌రాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు మోద‌కొండ‌మ్మ అమ్మ‌వారికి మినుముల కొండాపాత్రుడు కుటుంబాన్ని సేవ‌కులుగా చెబుతారు. అమ్మ‌వారికి మొదట నుంచీ ఈ కుటుంబం వారే దీప‌దూప నైవేద్యాలు స‌మ‌ర్పించేవార‌ని కొండా పాత్రుడు చెప్పేవారు. మోద‌కొండ‌మ్మ అమ్మ‌వారి చ‌రిత్ర‌ను బ‌యట ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డం కోసం నిరంత‌రం కృషి చేసేవారు. అమ్మ‌వారిపై ప‌రిశోధ‌న కోసం వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న స‌హాయ‌ప‌డేవారు. అందులో ఆయ‌నే అమ్మ‌వారి చ‌రిత్ర‌కు సంబంధించి ప్ర‌త్యేక పుస్త‌కాన్ని కూడా ముద్రించారు. అమ్మ‌వారి విశేషాల‌ను , చారిత్రక అంశాలను జ‌ర్న‌లిస్టుల‌కు చేర‌వేయ‌డంతో కొండా పాత్రుడు మంచి స‌హ‌కారం అందిస్తూ వారితో మంచి సంబంధాలు కొన‌సాగించారు.

అన్ని పార్టీల‌తో స‌త్సంబంధాలు
కొండాపాత్రుడు రాజ‌కీయ జీవితం తెలుగుదేశంతోనే ప్రారంభ‌మైంది. పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడుతో ఎక్కువ కాలం ప‌ని చేశారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం అనంత‌రం ఆయ‌న కమ్యూనిస్టుల‌తో క‌లిసి న‌డిచారు. మొద‌ట సీపీఎంతోనూ, త‌ర్వాత సీపీఐలోనూ కొన‌సాగారు. అందుకే మిడియం బాబూరావు, గొడ్డేటి దేముడుతో క‌ల‌సి ప‌ని చేశారు. అయితే ఆయ‌న ఏ పార్టీలో ఉన్నా పార్టీల‌తో సంబంధం లేకుండా అంద‌రితోనూ స‌త్సంబంధాలు కొన‌సాగించారు. వివాదాలకు దూరంగా ఉండేవారు. రాజ‌కీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. వారం రోజుల క్రితం వ‌ర‌కూ ఆయ‌న అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ ఆయ‌న చురుగ్గా పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *