కొండ‌ల్లో ట్రెండీమ్యాన్‌

Spread the love

ఫ్యాష‌న్‌…ఈ ప‌దం యువ‌త‌కు చాలా ఇష్టం. నిత్యం కొత్త‌గా క‌నిపించాల‌ని అంద‌రిలోనూ మెర‌వాల‌ని త‌పించ‌డ‌మే దీనికి కార‌ణం. గ్రామీణుల‌కు ఏమో కానీ ప‌ట్ట‌ణ ప్రాంతాల వారికి ఫ్యాష‌న్ ఓ ప్ర‌పంచం. ఎక్క‌డైనా యువ‌త ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఉంటుంది. ఓ సినిమాలో కాస్ట్యూమ్ కొత్త‌గా వ‌స్తే దాన్ని కుర్ర‌కారు క‌చ్చితంగా అనుస‌రిస్తుంది. 50 ఏళ్లు దాటిని వ్య‌క్తి అలాంటి ట్రెండ్‌ను ఫాలో అవుతారా? అదీ మైదాన ప్రాంతాల‌కు దూరంగా… అడ‌వుల్లో స‌రైన ర‌హ‌దారి కూడా లేని గ్రామ‌స్తుడు కొత్త‌గా ఉండాల‌ని త‌పిస్తున్నాడు. నిత్యం ట్రెండీగానే ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. వ‌య‌సు మీద ప‌డినా..ఇదేం వేషం అని పోలీసులు ర‌హ‌దారుల‌పై అడ్డ‌గిస్తున్నాస‌రే …ఇది ట‌యిల్ స‌ర్ అని చెప్పి మ‌రీ వాళ్ల‌ను ఒప్పిస్తుంటాడు. ఇంట్లో సాధార‌ణ దుస్తుల‌తో ఉంటాడు.. బ‌య‌ట‌కొస్తే త‌న‌దైన శైలిలో త‌యారు చేయించుకున్న కాస్ట్యూమ్‌తో వ‌స్తాడు. అది బ్యాంకు ప‌ని మీదైనా, వేరే ఊరు గానీ, వేడుక‌లకు గానీ వెళ్లాల‌న్నా విభిన్నంగా ఉంటాడు. అదే అప్పారావు ట్రెండ్ అట‌.. ఇత‌నది విశాఖ ఏజెన్సీలోని చింత‌ప‌ల్లి మండ‌లం ల‌బ్బ‌ర‌గొందు అనే కుగ్రామం. ఈయ‌న జీవ‌న శైలిని మీ ఎంఎల్ ఏ న్యూస్ పోర్ట‌ల్ ప్ర‌తినిధి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించారు.


వ్య‌క్తుల మీద సినిమాల ప్ర‌భావం ఉంటుందా? అంటే అవునో? కాదో చెప్ప‌లేం గానీ ఈ అప్పారావు మీద మాత్రం సినిమాయే ప్ర‌భావం చూపించింది. ఇత‌న‌కి చిన్న‌ప్ప‌టి నుంచి అంద‌రికంటే భిన్నంగా ఉండాల‌ని ఉండేద‌ట‌. కానీ అది ఎలాగో తెలిసేది కాదు. కానీ 1999 నాగార్జున న‌టించిన హ‌లో బ్ర‌ద‌ర్ చిత్రం ఆయ‌న ఆలోచ‌న‌కు ఊపిరి పోసింది. ఆ సినిమాలో నాగార్జున వేషం ఇత‌న్ని ఆక‌ట్టుకుంది. అది జీవన శైలినే మార్చేసింది. అదే ఏజెన్సీలోనే ఇత‌నొక సెలబ్రిటీని కూడా చేసింది. మ‌న్యంలో ఫ్యాష‌న్ వీరుడు అప్పారావు అంటే తెలియ‌ని వారు లేరంటేనే ఇత‌నెంత ఫేమ‌సో చెప్పొచ్చు. అత‌నొక హీరో…కాస్ట్యూమ్ డిజైన‌ర్‌..స్వ‌చ్ఛ‌మైన రైతు. మ‌న‌సులో ఏం ఊహించుకుంటాడో అది కాస్ట్యూమ్ రూపంలో తీసుకొస్తాడు. దాని ఖ‌ర్చుకు కూడా వెనుకాడ‌డు. అప్పా‌రావుకు డ్రెస్సులు కుట్ట‌డానికి చింత‌ప‌ల్లిలో ప్ర‌త్యేకంగా ఓ టైల‌ర్ ఉన్నాడట‌. అత‌ని పేరూ అప్పారావే. ఒక్క డ్రెస్‌లోనే కాదు ఆయ‌న ధ‌రించే టోపీ నుంచి న‌డిపే వాహ‌నం వ‌ర‌కూ అంతా విభిన్నమే. ర‌హ‌దారి గుండా ఆయ‌నొస్తున్నాడంటే అంతా చూడాల్సిందే. కొంద‌రు న‌వ్వుకున్నా…మ‌రికొంద‌రు వావ్ అన్నా..పోలీసులు ఇదేంట‌య్యా…అని నిల‌దీసినా అత‌నెక్క‌డా త‌గ్గ‌డ‌ట‌. నేనింతే ట‌యిల్‌గా ఉండాల‌ని అనుకుంటా అని అంద‌రికీ చిరు న‌వ్వుతోనే స‌మాధానం ఇస్తుంటాడు. త‌న సంపాద‌న‌లో స‌గం వ‌ర‌కూ ఈ క‌స్ట్యూమ్ల‌కే వెచ్చిస్తార‌ట‌. ఎందుకంటే ఇప్ప‌టివ‌ర‌కూ వంద‌కు పైగా ట్రెండీ డ్రెస్స‌ల‌ను కుట్టించారు కాబట్టి. అదీ త‌న‌కు న‌చ్చిన ప‌ద్ద‌తిలో కుట్టాలంటే టైల‌ర్ చాలా డ‌బ్బులే డిమాండ్ చేసేవాడ‌ట‌. చీర‌ల‌ను కూడా ఫ్యాంటు ష‌ర్ట్‌లుగా మ‌లిచి వాటినే ధ‌రించేవాడు.
టిక్‌టాక్ అప్పారావు
ఈ వేష‌ధార‌ణ‌పై ఏజెన్సీ కుర్రాళ్లు ప్ర‌త్యేక‌మైన టిక్‌టాక్‌లతో హ‌ల్‌చ‌ల్ చేసేవారు. అలా కూడా ఈయ‌నొక సెల‌బ్రిటీ అయ్యారు. మ‌న్యంలో ఇత‌న‌పైనే 12 టిక్‌టాక్‌లు మొన్న‌టి వర‌కూ యువ‌త మొబైళ్ల‌లో చ‌క్క‌ర్ల‌కొట్టేవి.
టోపీ నుంచి వాహనం వ‌ర‌కూ

అప్పారావు ప్ర‌త్యేకంగా త‌యారు చేసుకున్న టోపీ
వివిధ డ్రెస్సుల‌తో కూడిన ఫొటోల‌ను అతికించిన బైక్‌


ఆయ‌న ఆలోచ‌న‌ల‌తో రూపొందిన కాస్ట్యూమ్‌లో దిగిన ఫొటోల‌తో సొంతంగా టోపీ త‌యారు చేసుకున్నారు. ఆయ‌న న‌డిపే బైక్ కు చుట్టూ ఇవే ఫొటోలు అతికించి ఉంటాయి. ఆల్బ‌మ్ కూడా త‌న వెంటే నిత్యం ఉంచుకుంటాడు. మీ ఎంఎల్ ఏ న్యూస్ పోర్ట‌ల్‌ప్ర‌తినిధికి కూడా అప్ప‌టిక‌ప్పుడు బైక్‌లో ఉన్న ఆల్బ‌మ్‌ను తీసి చూపించాడు.
గోల్డ్‌ఫిష్ సినిమాలో అవ‌కాశం
ఈయ‌న ఫ్యాష‌న్‌ను గ‌మ‌నించిన గోల్డ్ ఫిస్ చిత్ర‌బృందం ఆ సినిమాలో ఒక్క నిమిషం పాటు క‌నిపించే చిన్న పాటి పాత్ర‌లో అవ‌కాశం ఇచ్చారు. చింత‌ప‌ల్లి స‌మీపంలో వంగ‌సారిలో ఆ చిత్రం సినిమా షూటింగ్ జ‌ర‌గిన‌ప్పుడు ఈయ‌న చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నారు. సాయి కుమారు కొడుకు ఆది ఆ సినిమాలో హీరోగా చేశారు.
రైతు ప‌నే ఆధారం
ఇంత ఫ్యాష‌న్‌గా ఉన్నా…అత‌నో నిజాయితీ గ‌ల రైతు. క‌ష్టించి ప‌ని చేస్తే వ‌చ్చే డ‌బ్బుల‌తోనే ఈ త‌ర‌హా జీవ‌నం సాగిస్తాడు. నిమ్మ‌తోట‌. కాఫీ, పైనాపిల్‌, మొక్క‌జొన్న పంట‌లు పండిస్తాడు. వీటిపై వ‌చ్చే ఆదాయంతో త‌న ముగ్గురు పిల్ల‌ల‌ను పోషించి వివాహాలు కూడా చేశాడు. చెడు అల‌వాట్ల‌కు దూరం…ప్యాష‌న్ అంటే ప్రాణంగా ఉండే వ్య‌క్తి.

అప్పారావు పాటించే ట్రెండ్ డ్రెస్సులు, జీవ‌న శైలి గురించి ఆయ‌న మాట‌ల్లో ఇక్క‌డ చూడొచ్చు
అప్పారావు హెయిర్ స్ట‌యిల్‌
ఒక‌ప్ప‌టి అప్పారావు ఫొటో ఇది

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *