రెగ్యులరైజేషన్ కోరుతూ ఉద్యమానికి సిద్ధమైన కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు

Spread the love

వైద్య ఆరోగ్య శాఖ లోని డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు తమ రెగ్యులరైజేషన్ ప్రధాన ధ్యేయంగా సోమవారం నుంచి ఉద్యమించేందుకు సన్నద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ డి.ఎస్.సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జె.ఏ.సి) రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మినుములూరు పి.హెచ్.సి ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఇరవై ఏళ్ళ నాటి రెగ్యులర్ కలను తాను అధికారంలోకి వస్తే తప్పకుండా తీరుస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నేటికీ అది కలగానే మిగిలిపోతుండటంతో తీవ్ర నిరాశకు గురైన కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగులు ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమబాటపట్టారు. ప్రజాసంకల్ప యాత్రలోనూ, ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇచ్చిన అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులర్ చేస్తామన్నా హామీని ప్రస్తుత కోవిడ్ కీలకమైన సమయంలోనైనా నెరవేరిస్తే ఇచ్చిన మాటకు విలువైన ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే వైద్య ఆరోగ్య శాఖ లోని అన్ని క్యాడర్ల ఉద్యోగుల కృషి కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించడమే కాకుండా వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుండటం ఆనందదాయకమేనని అన్నారు. అయితే, గత ఇరవై ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగభద్రతా లేకుండానే ప్రాణాంతక మహమ్మారి కరోనా కట్టడికి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రాణత్యాగాలు చేస్తున్నా కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల పట్ల ఎందుకు జాలి, దయ కలగడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ప్రభుత్వాలు కమిటీల పేరుతో తమ క్రమబద్ధీకరణ తీవ్ర కాలయాపన చేసి దగా చేశాయని, మ్యానిఫెస్టో ని పవిత్ర గ్రంధాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావిస్తూ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి అన్ని అర్హతలున్నా కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయం లో ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదంటున్నారు. మాట తప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు తప్పకుండా న్యాయం చేసి తీరుతారన్న ఆశ జరుగుతున్న తాత్సారం తో రోజురోజుకీ సన్నగిల్లిపోతుందన్నారు.
అందుకే తమ ఘోష ప్రభుత్వానికి గట్టిగా వినిపించేందుకే సోమవారం నుంచి నిరంతరాయంగా నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలిచామని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈనాటి కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు శెట్టి నాగరాజు, లక్ష్మణ్, స్టాఫ్ నర్స్ మోద , గణేశ్వరి, మూర్తి,దొర,జగన్, దామోదర్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *