ఈ ఏడాది ర‌బీ క‌లిసొచ్చిందా?

Spread the love

రైతులు సాగుచేసే పంట‌ల్లో వ‌రి ప్ర‌ధాన‌మైన‌ది. అంత‌ర పంటలు, చిరు ధాన్యాలకు రెండో ప్రాధాన్యం ఇస్తారు. మన రాష్ట్రా౦లో వరి ప్రధానంగా పండిస్తారు. అందులో ఖరీఫ్, ర‌బీ ప౦ట కాలాల్లో, పలు వాతావరణ పరిస్టితుల్లో వ‌రిని సాగుచేస్తారు. వరి ఖరీఫ్ లో సుమారుగా 30.04 లక్షల హెక్లార్లలోనూ ,రబీలో సుమారుగా 12.39 లక్షల హెక్లార్లలో రాష్ట్రంలో సాగుచేస్తారు అన్న‌దాత‌లు. సుమారు 99.46 లక్ష‌ల టన్నుల వ‌రి ధాన్యాల‌ను ఉత్ప‌త్తి చేస్తారు. ఖరీఫ్ లో దిగుబడి ఎకరాకు 1150 కిలోలు, రబీలో 1470 కిలోలు సరాసరి దిగుబడి 1240 కిలోలు ఇస్తుంద‌ని వ్య‌వ‌సాయ శాఖ అంచ‌నా. కానీ ఏడాది వ్య‌వ‌సాధికారులు, వ్య‌వ‌సాయ శాక అంచ‌నాల‌కు భిన్నంగా ఫ‌లితాలు వ‌చ్చాయి. కొన్ని చోట్ల ఆశించిన ఫ‌లితాలు వ‌చ్చినా పంట చేత‌కొచ్చే స‌మ‌యంలో వ‌ర్షాలు కార‌ణంగా వ‌రి మొత్తం దెబ్బ‌తినిపోయింది. వ‌ర్షాల ప్ర‌భావం ముఖ్యంగా తూర్పుగోదావరి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌పై ఎక్కువ‌గా ప‌డింది. ప్ర‌స్తుతం క‌రోనా విల‌య‌తాండవం చేస్తుండ‌డంతో అన్న‌దాత‌ల క‌ష్టాల‌పై దృష్టి సారించ‌లేదు. ప్ర‌స్తుతం మీరు చూస్తున్న‌ ఈ వీడియోలోని వ‌రి పంట‌లు విశాఖ జిల్లా చోడ‌వరం మండ‌లం పెద్దేరు రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలో వ‌డ్డాది చాన‌ల్ కింద ఉన్న బెన్న‌వోలు, బుచ్చియ్య‌పేట మండ‌లంలోని పోలేప‌ల్లి, వ‌డ్డాది గ్రామాల రైతుల‌వి. ఈ గ్రామాల రైతులు ఏటా వింత ప‌రిస్థితిని ఎదుర్కొంటారు. ఒక్క బెన్న‌వోలు గ్రామం త‌ప్ప మిగిలిన గ్రామాల‌కు ఖ‌రీఫ్‌, ర‌బీ పంట‌లు పండుతాయి. కానీ ఖ‌రీఫ్ పండిన‌ప్పుడు లేని స‌మ‌స్య‌లు ర‌బీ స‌మ‌యం వ‌చ్చేస‌రికి వ‌చ్చేస్తాయి. వ‌డ్డాది, గౌరీపట్నం, పోలేప‌ల్లి, బుచ్చియ్య‌పేటలో కొంద‌రికి మాత్రం పెద్ద‌గా స‌మ‌స్య ఉండ‌దు గానీ, లోత‌ట్టు ప్రాంతంలో పొలాలు ఉన్న వారు తీవ్ర‌మైన స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఇక్క‌డ వింత ప‌రిస్థితి ఏమిటంటే …. ఏటా పంట పండించ‌డ‌మే క‌ష్ట‌మ‌నుకుంటే దాన్ని ఇంటికి చేర్చ‌డ‌మే అతిపెద్ద శ్ర‌మ‌. ఎందుకంటే ఇక్క‌డ పంట పండి చేతికొచ్చే స‌మ‌యంలో భారీగా వ‌ర్షాలు కురిసేస్తూ ఉంటాయి. ఈ ప‌రిస్థితి ఏటా ఉత్ప‌న్న‌మ‌వుతూ ఉంటుంది. ఎప్పుడో దేవుడు ద‌య‌ద‌లిస్తే త‌ప్ప ఏటా పండించిన పంట ఇంటికి తెచ్చుకోవ‌డానికి తిప్ప‌లే. వాస్త‌వంగా ఇక్క‌డ రైతులు పండించే ప్ర‌తీ గింజి వారి సొంత అవ‌స‌రాలకే. వ్యాపారానికి మాత్రం కాదు. అందుకే పంట నుంచి వ‌చ్చే ఫ‌లితం కంటే ఖ‌ర్చు భారీగా పెరిగిపోతున్నా…ఏటా నీట మునిగే పొలాల్లో పంట‌లు వేస్తూనే ఉంటారు. వాస్త‌వానికి ఒక్కో రైతు రూ. 10వేలు వెచ్చిస్తే ఆయా రైతుల కుటుంబాలు ఏడాది తిన‌డానికి ధాన్యం గింజ‌లు ల‌భిస్తాయి. అయినా స‌రే ఇక్క‌డ అన్న‌దాత‌లు మాత్రం ఎక్కువ ఖ‌ర్చు పెట్టి పంట‌లు పండిస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నార‌ని ఓ అన్న‌దాత‌ల‌ను ప‌శ్నిస్తే…త‌మ వ‌ద్ద ఉన్న ప‌శువుల‌కైనా తిన‌డానికి ఎండుగ‌డ్డి దొర‌కుతుంద‌నే ఇలా న‌ష్ట‌మొచ్చినా పండిస్తున్నామ‌ని చెబుతున్నారు. ఈ ఏడాది మ‌రీ భిన్నం…. ఒక ఏడాది కొంత మొత్తంలో వ‌డ్డాది చాన‌ల్ నుంచి నీరొస్తే…చాల‌నిదానికి వ్య‌వ‌సాయ బోర్ల నుంచి నీళ్లు పెట్టి వ‌రి పండించేవారు ఇక్క‌డి రైతులు. కొన్నిసార్లు అయితే వ్య‌వ‌సాయ బోర్ల‌తో ప‌నిలేకుండానే వ‌డ్డాది చాన‌ల్ నుంచి వ‌చ్చే నీటితోనే వ‌రి పండేసేది. ఈ ఏడాది ఆ చాన‌ల్ ప‌రిధిలో ఉన్న గ్రోయిన్ పూర్తిగా దెబ్బ‌తిన‌డంతో గ‌డ్డు ప‌రిస్థితి ఏర్ప‌డింది. వంద‌లాది ఎక‌రాలకు నీరెళ్లాలంటే ఈ ఆ దెబ్బ‌తిన్న గ్రోయినే ప్ర‌ధాన ఆధార‌మని తెలిసిన ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. మ‌నం ఎన్ని చెప్పినా ప్ర‌భుత్వం విన‌ద‌ని ముందుగానే గ్ర‌హించిన‌ బుచ్చియ్య‌పేట‌, వ‌డ్డాది, గౌరీప‌ట్నం రైతులు ఈ ఏడాది ర‌బీ సాగుచేయ‌డం మానేశారు. అందుకే ఆ పొలాల‌న్ని ఖాళీగానే ఉండిపోయాయి. పోలేప‌ల్లిలో కొంద‌రికి, బెన్న‌వోలు వారికి ర‌బీయే ఆధారం కాబ‌ట్టి ఏదొక‌టి జ‌రుగుతుందిలే అని వ‌రి నారుమ‌డులు వేశారు. ఒక‌సారి వ‌ర‌ద నీటికి పోతే మ‌రొక సారి మ‌ళ్లీ నారుమ‌ళ్లు వేసి సాగు చేశారు. తీరా నాట్లు వేసిన స‌మ‌యానికే పూర్తిగా నీటికి క‌రువొచ్చింది. ఇక మ‌రొక దిక్కులేక అన్న‌దాతలంతా వ్య‌వ‌సాయ బోర్ల‌పైనే ఆధార‌ప‌డ్డారు. మొత్తం మూడునెల‌లు పాటు నాలుగు రోజుల‌కోసారి వ్య‌వ‌సాయ బోర్ల నుంచి నీరు పెట్టి మొత్తానికి ఎలాగోలా పంట‌ను పండించారు. ఏటా వ‌ర్షానికి న‌ష్ట‌పోతున్న అన్న‌దాత‌లకు ఈ ఏడాది దాన్నుంచి కాస్త ఉప‌స‌మ‌నం ల‌భించింది. ఎందుకంటే వ‌రి కోత కోసి వెంట‌నే రైతుల క‌ళ్లాల వ‌ద్ద‌కు తీసుకొచ్చేస్తున్నారు. అయినా కొంద‌రు రైతులు కోసిన‌ కోత త‌డిసిపోయింది. అన్న‌దాత‌లు మ‌నోధైర్యం కోల్పోకుండా వెంట‌వెంట‌నే కోసింది కోసిన‌ట్టుగానే త‌మ క‌ళ్లాల‌కు, ఇళ్ల‌కు తీసుకొచ్చేస్తున్నారు. కొంత‌కాలంగా రైతుల్లో కూడా మార్పులు వ‌చ్చాయి. గ‌తంలో వ‌రి కుప్ప‌ల నూర్పిళ్లు చేయాలంటే ప‌శువుల‌తోనే కానిచ్చేసేవారు. ఒక ఏక‌రాలో పండిన వ‌రిని నూర్చాలంటే ఓ ప‌ది మంది, నాలుగు జ‌త‌ల ఎడ్లు గానీ, దున్న‌పోతులు గానీ ఉప‌యోగించేవారు. ఈ రెండు లేనివారు గెదేల‌తోనే వ‌రిని తొక్కించి ఎలాగోలా ధాన్యాన్ని ఇంటికి చేర్చుకునేవారు. కుప్ప నూర్పిడి మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి గాలిపోసి ఇంటికి చేరేవ‌ర‌కూ పది మంది నిత్యం ప‌ని చేయాల్సి వ‌చ్చేది. ఇప్పుడు రైతుల‌కు ఈ క‌ష్టాల నుంచి కాస్త ఉప‌స‌మ‌యం క‌లిగింద‌నే చెప్పాలి. ఆధునిక ప‌రిక‌రాలు ఉప‌యోగించి వ‌రి నూర్పిళ్లు చేస్తున్నారు. ఇక్క‌డ రైతులు వ‌రి కోత‌కు మాత్రం వా ళ్లే చే సుకుంటున్నా…నూర్పిళ్ల‌కు మాత్రం నూర్పిడి యంత్రం సాయం తీసుకుంటున్నారు. దీని వ‌ల్ల స‌మ‌యం, ధ‌నం, శ్ర‌మ ఆదా అవుతున్నాయి. ఒకటి రెండు రోజులు పాటు ప‌ది నుంచి 15 మంది శ్ర‌మించాల్సిన ప‌నిని మొత్తం నూర్పిడి య‌త్రం ఒక‌టి రెండు గంట‌ల్లో కానిచ్చేస్తుంది. రైతు కేవ‌లం త‌మ ధాన్యం ప‌ట్టుకోవ‌డానికి గోనె సంచులు సిద్ధం చేసుకుంటే చాలు. అన్ని ప‌నులూ ఆ నూర్పిడి యంత్రం , ఆ యంత్రంతో ప‌ని చేసే వారే చేసుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది మాత్రం రైతులు రబీకోసం పెట్టిన పెట్టుబ‌డి కూడా పండిన వ‌రి విక్ర‌యిస్తే రాదంటే న‌మ్మాల్సిందే…

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *