ఏ హాస్ప‌టల్‌కి వెళ్లినా అత‌ని ఫొటోనే…

Spread the love

ఒక ఆస్ప‌త్రి నుంచి మ‌రో హాస్ప‌ట‌ల్ కు బ‌దిలీ అయిన డాక్ట‌ర్ అక్క‌డ రెండేళ్లో మూడేళ్లో ఉంటారు. మ‌రీ స్థానికుడైతే మ‌రో రెండేళ్లు ఉండ‌గ‌ల‌రేమో. కానీ అత‌ని జీవిత కాలం ఒకే ఆస్ప‌త్రిలో ఉండ‌గ‌ల‌రా?. అదీ ప్ర‌భుత్వం మ‌రో చోట‌కు బ‌దిలీ చేస్తే క‌లెక్ట‌రేట్‌లో ధ‌ర్నాలు చేసి మ‌రీ మా ఆస్ప‌త్రిలోనే అత‌న్ని ఉంచండి…అని ప్ర‌జ‌లే కోరుకునే వైద్యులున్నారా? ఎంత గొప్ప సేవ‌లందించినా ఆ చుట్టూ ఉన్న రెండు మూడు మండ‌లాల‌కు తెలిసి ఉంటుందేమో. కానీ జిల్లాలు దాటి పేరుగాంచిన‌వాళ్ల‌వుతారా? ప్ర‌తి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలోనూ ఓ డాక్ట‌ర్ ఫొటో… అదీ ఓపీ వద్ద పెడ‌తారా?…సాధార‌ణంగా ఆస్ప‌త్రుల‌కు స్థానిక‌ రాజ‌కీయ నాయ‌కులు పేర్లు ఉంటాయి. కానీ వైద్యం అందించిన అదే ఆస్ప‌త్రికి ఆ డాక్ట‌ర్ పేరే పెడ‌తారా?….ఓ సాధార‌ణ వైద్యుడు పేరు పెట్టండ‌ని ప్రభుత్వం జీవో తెచ్చిన సంద‌ర్భాలు ఉన్నాయా?…

డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ సేవ‌ల గురించి వివ‌రిస్తున్న లోతుగెడ్డ వైద్యురాలు ఇందిరా, సిబ్బంది సుధ, భ‌వాని, ల్యాబ్ టెక్నిషియ‌న్ సింహాచ‌లం, ఫ‌ణి త‌దిత‌రులు


ప్ర‌భుత్వం జీతం ఇస్తుంది. దానికి త‌గ్గ‌‌ట్టు న‌డుచుకుంటూ పోతే స‌రి అనుకుంటే ఆ ఆస్పత్రికి వ‌చ్చిన వైద్యుల జాబితాలో అత‌నొక‌రుగా మిగిలిపోతారు. అక్క‌డ ప్ర‌జ‌లు మూఢ‌న‌మ్మ‌కాల‌తో జీవిస్తున్నారు. దానిపై అవ‌గాహ‌న ప‌రిచి సైన్సుపై న‌మ్మ‌కం క‌లిగించాల‌ని నిరంత‌రం ప్ర‌జాసేవ‌లోనే ఉంటే అత‌నో దేవుడిగా మిగిలిపోతారు. ఆయ‌న ఉన్నా…లేక‌పోయినా సాయం పొందిన వారి గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతారు. అటువంటి వారు త‌క్కువ మంది ఉంటారు. ఆ జాబితాలో వ్య‌క్తే డాక్ట‌ర్ లింగంగుంట స‌త్య‌నారాయ‌ణ‌. విశాఖ ఏజెన్సీలోని చింత‌ప‌ల్లి మండ‌లం లోతుగెడ్డ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం వైద్యులుగా సేవ‌లందించారు. ఇక్క‌డ గిరిజ‌నుల‌కు ఇత‌నొక దేవుడు. గిరిపుత్రుల‌కు కొత్త‌జీవితాల‌ను ఇచ్చిన మ‌హానుభావుడు. అందుకే ఇత‌న్ని మా మంచి డాక్ట‌ర్ అని ఇక్క‌డ వారంతా చెప్పుకుంటారు.

లోతుగెడ్డ ప్రాథ‌మిక కేంద్రం ఆవ‌ర‌ణంలో గిరిజ‌నులు నెల‌కొల్పిన డాక్ట‌ర్ లింగంగుంట స‌త్య‌నారాయ‌ణ విగ్ర‌హం
డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ సేవ‌ల గురించి వివ‌రిస్తున్న లోతుగెడ్డ వైద్యురాలు ఇందిరా, సిబ్బంది సుధ, భ‌వాని, ల్యాబ్ టెక్నిషియ‌న్ సింహాచ‌లం, ఫ‌ణి త‌దిత‌రులు

సాధార‌ణంగా ప్రాథ‌మిక ఆరోగ్యం కేంద్రానికి వైద్యం కోసం వెళితే అక్క‌డ ఎలాంటి సేవ‌లు అందుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అదీ విశాఖ ఏజెన్సీలో ఉంటే మరీ చెప్ప‌న‌క్క‌ర్లేదు. నిజ‌మే లోతుగెడ్డ ప్రాథ‌మిక ఆస్ప‌త్రి ప‌రిస్థితి కూడా 2002కి ముందు అలాగే ఉండేది. స‌త్య‌నారాయ‌ణ డాక్ట‌ర్ ఈ ఆస్ప‌త్రికి బ‌దిలీ అయినా త‌ర్వాతే ఇక్క‌డొక ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఉంద‌ని తెలిసింది. ఆయ‌న ఇక్క‌డ విధులు చేప‌ట్టిన తొలి ఏడాది మొత్తంగా 22,156 ఓపీ చూశారు. నాలుగేళ్ల త‌ర్వాత 94,631 ఓపీ కేసులు రిజ‌స్ట‌ర్ అయ్యాయి. అంటే సుమారుగా రోజుకు 263 మంది వైద్యం కోసం ఈ ఆస్పత్రికొచ్చేవారు.

మా మంచి డాక్ట‌ర్ పేరిట స‌త్య‌నారాయ‌ణ జీవితం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌చురించిన పుస్త‌కం...ఈ పుస్త‌కాన్ని గ‌డుతూరి నాగేశ్వ‌ర‌రావు ర‌చించారు

ఎక్క‌డైనా పీహెచ్ సీలో రోజులో ఇంత‌మంది రోగుల‌ను ఓపీలో చూస్తుందా? ఎక్క‌డైనా ఇలా చూసిన‌ట్టు రికార్డులు ఉన్నాయా?. ఉండ‌వు. అందుకే ఇక్క‌డ‌కొచ్చేవారికి ఈ భ‌వ‌నం చాల్లేద‌ని ఏకంగా ఓ మోస్తారు పెద్దాస్ప‌త్రి త‌ర‌హాలో ఐదు బిల్డింగులు నిర్మించాల్సి వ‌చ్చింది. వైద్యం అన్నా, డాక్ట‌ర్ అన్నా తెలియ‌ని గిరిజ‌నులు ఇంత భారీ సంఖ్య‌లో ఈ హాస్ప‌ట‌ల్‌కు రావ‌డం వెనుకు డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ కృషి ఎన‌లేనిది. త‌న జీవిత కాలం ఎక్కువ ఈ ఆస్ప‌త్రిలోనే గ‌డిపారు. మూఢన‌మ్మ‌కాల మ‌ధ్య వైద్యం పొంద‌లేక మ‌ర‌ణిస్తున్న గిరిజ‌నుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే క్ర‌మంలో భౌతిక దాడులు కూడా ఈ వైద్యులు ఎదుర్కొన్నారు…కానీ వాళ్ల‌పై కోప‌గించుకోకుండా తెలియ‌ద‌ని మ‌రోమారు చెప్పే ప్ర‌య‌త్నం చేసేవారు. ఇలా మూడు నాలుగేళ్ల పోరాటం త‌ర్వాత ఆస్ప‌త్రి నిండా జ‌న‌మే. ముఖ్యంగా సోమ‌, బుధ‌వారాల్లో అయితే కిలోమీట‌ర్లు మేర‌ వైద్యం కోసం క్యూల‌లో జ‌నాలు ఉండేవారు. ఏజెన్సీలో ఉండే అనంత‌గిరి, సీలేరు, అర‌కు, పాడేరు, తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ‌, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల వారు ఇక్క‌డ వైద్యం కోసం వ‌చ్చేవారంటే ఇత‌ను అందించే వైద్యం ఎలా ఉండేదో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందుకే ప్ర‌భుత్వం ఇత్త‌న్ని వేరే ఆస్ప‌త్రికి బ‌దిలీ చేస్తే విశాఖ క‌లెక్ట‌రేట్‌ను ముట్ట‌డించి ధ‌ర్నా చేసి మ‌రీ ఆ డాక్ట‌ర్‌ను మ‌ళ్లీ ఇక్క‌డికే ట్రాన్స‌ఫ‌ర్ చేయించుకున్నారు ఏజెన్సీ గిరిజ‌నులు. నిత్యం గిరిపుత్రుల సేవ కోసం త‌పించే ఈ స‌త్య‌నారాయ‌ణ డాక్ట‌ర్ ఇదే ఆస్ప‌త్రిలో రెండేళ్ల క్రితం గుండెపోటుతో అకాల‌మ‌ర‌ణం పొందారు. ఆ స‌మ‌యంలో మ‌న్యం క‌న్నీరు పెట్టుకుంది. త‌మ ఇంట్లో బంధువు దూర‌మైతే ఎలాంటి బాధ‌ను అనుభవిస్తారో అటువంటి బాధ‌ను ఆ రోజు అనుభ‌వించారు. ఆయ‌న సేవ‌ల‌కు గుర్తుగా ఇక్క‌డ ఓ విభాగానికి డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం అని పేరు పెట్టారు. ఇలా పేరు పెట్టడానికి ప్ర‌భుత్వం అనుమ‌తించేలా కృషి చేయ‌డంలోనూ, ఉత్త‌ర్వులు పాస్ చేయించ‌డంలోనూ జిల్లా క‌లెక్ట‌ర్ వాడ‌రేపు విన‌య్ చంద్‌, ఐటీడీఏ పీవో బాలాజీ డీకే కృషి వ‌ర్ణించ‌లేనిది. ఏజెన్సీలో ఉన్న 33 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ చూసే విభాగం వ‌ద్ద డాక్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ ఫొటో త‌ప్ప‌నిస‌రిగా ఉంచాల‌ని, అత‌ని సేవ‌ల‌ను ప్ర‌తి వైద్యుడూ స్ఫూర్తిగా తీసుకోవాల‌ని ఆదేశిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేయించారు. అంతేకాకుండా ఇత‌ని సేవ‌ల‌కు గుర్తుగా లోతుగెడ్డ ఆస్ప‌త్రిలో స‌త్య‌నారాయ‌ణ డాక్ట‌ర్ విగ్ర‌హం ఏర్పాటు చేశారు. అందుకే నిస్వార్థ‌మైన సేవ‌లందించే ఇలాంటి డాక్ట‌ర్ జీవితాంతం ప్ర‌జ‌ల గుండెల్లో ఉండిపోతారు.

డాక్ట‌రు స‌త్య‌నారాయ‌ణ సేవ‌ల‌ను గురించి వివ‌రిస్తున్న లోతుగెడ్డ నాయ‌కుడు చింత‌ర్ల సునీల్‌

Recommended For You

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *