ప్ర‌పంచ ‌దేశాలే ఆ ఊరిని గూగుల్ లో వెతుకుతాయ్

Spread the love

మ‌న ఊరు గురించి గూగుల్ లో ఎంత మంది వెతికుంటారు… ఆ…ఎవ‌రెతుకుతారులే… నువ్వో, నేనో, మ‌రో వ్య‌క్తో… అత‌నూ మ‌నూరోడే అయి ఉంటాడు… మ‌నూరు గురించి ఎవ‌రు వెతుకుతారా? అంటారు…అదీ ఏ న‌గ‌రానికో ద‌గ్గ‌రో ఉన్న ప‌ల్లె గురించి అయినా ఇలాగే అంటారు. కానీ అది ఉండేది ప‌ట్ట‌ణానికి 150 కి.మి.దూరంలోనూ…ద‌ట్ట‌మైన అడవిలోనూ…అడిగినా అదెక్క‌డుంద‌ని అనే గ్రామాన్ని ప్ర‌పంచంలో ఇప్పుడు ఐదారు దేశాల వారు రోజూ ఆ ప‌ల్లె గురించి గూగుల్‌లో ఓ సారి అయినా వెతుకుతున్నారట‌. నిజం… ఆ గ్రామ‌మే కొత్త‌ప‌ల్లి…ఇది పాడేరు నుంచి జి.మాడుగుల మీద‌గా చింత‌ప‌ల్లి వెళ్లే మార్గంలో క‌నిపిస్తుంది. ఆ కుగ్రామం ప్ర‌పంచంలో ప్ర‌త్యేక‌‌త‌ను సంత‌రించుకోవ‌డానికి కొంద‌రు యువ‌కులు చేసిన కృషి అంతా ఇంతా కాదు..
పూట గ‌డ‌వ‌ని బ‌తుకులు…తానెలా బ‌త‌కాల‌నే త‌ప్ప ప‌క్క‌వాడి కోసం ఆలోచన కూడా రానియ్య‌ని ద‌య‌నీయ ప‌రిస్థ‌తి వాళ్ల‌ది.. త‌ర‌త‌రాల నుంచి ఇలాగే బ‌తుకుతున్నాం. ఇంకెప్ప‌డు మారుతాయ్ త‌మ బ‌తుకులు అని అనుకున్నారో ఏమో గానీ… ఇంట‌ర్మీడియేట్ చ‌దువుతున్న ఓ యువ‌కుడికి వ‌చ్చిన ఆలోచ‌న వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. బూత‌ద్దంలో వెతికినా క‌నిపించిన వాళ్ల ఊరును ప్ర‌పంచ‌దేశాలు గుర్తించేలా చేశారు ఆ కొత్త‌ప‌ల్లి కుర్రాళ్లు…
మీ MLA న్యూస్‌పోర్ట‌ల్ గ్రౌండ్ రిపోర్ట్‌

కొత్త‌ప‌ల్లి జ‌ల‌పాతం

పాడేరు నుంచి చింత‌ప‌ల్లి వెళ్లే మార్గంలో మెయిన్ రోడ్డ‌కు ఆనుకొనే ఉన్నా…బ‌స్సెక్కి కొత్త‌ప‌ల్లికి టికెట్ ఇవ్వండ‌ని కండాక్ట‌ర్‌ను అడిగితే అదెక్క‌డుంద‌ని అనేవారు. ఈ రోజు ప్ర‌పంచ దేశాల్లో ఐదారు దేశాలు వాళ్ల‌యినా ఈ ఊరు గురించి గూగుల్‌లో వెతుకుతారు. నిత్యం ప‌ర్యాట‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంటుంది. ప్ర‌కృతిని ఆస్వాదించాల‌నుకొని అక్క‌డ‌కొచ్చేవారు, రెండు మూడు రోజులైన అక్క‌డ ఉండిపోతారు. అంత హాయిగా ఉంటుంద‌క్క‌డ‌. ఇక్క‌డ‌కు ఆస్ట్రేలియా, జ‌ర్మ‌నీ, ఫ్రాన్సు, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల వారు వ‌స్తున్నారు.

కొత్త‌ప‌ల్లి జ‌లపాతాలు – ప్ర‌స్తుతం ఆద‌ర‌ణ పొందుడం వెనుక ఆ గ్రామ యువ‌కులు ప‌డ్డ క‌ష్టం గురించి వివ‌రిస్తున్న యవ‌త‌, జ‌ల‌పాత అందాలు ఈ వీడియోలో చూడొచ్చు

జి.మాడుగుల మండ‌లం కొత్త‌ప‌ల్లి ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు. ఊరికి స‌మీపంలోనే గ‌ల‌గ‌ల పారే సెల‌యేళ్ల శ‌బ్దాలు వినిపిస్తున్నా…దాన్ని అంద‌మైన ప్ర‌దేశంగా గుర్తించాల‌న్న ఆలోచ‌న అప్పుడు వాళ్ల‌కు లేదు.ఈ ఊరే ఎవ‌రికీ తెలిసేది కాదు. కానీ ఆ గ్రామానికి చెందిన అభి అనే కుర్రాడు చిన్న‌ప్ప‌టి నుంచీ అక్క‌డ అందాల‌ను ప‌రిశీలించేవాడు. ఇంటికి స‌మీపంలో ఉన్న జ‌ల‌పాతాల వ‌ద్ద స్నానాలు చేసేవాడు. ఇంట‌ర్మీడియేట్ చ‌దువుకునే స‌మ‌యంలో ప‌ర్యాట‌క ప్రాంత‌మైన చాప‌రాయిని చూడ్డానికి వెళ్లాడు. అప్పుడే అత‌ని మ‌న‌సులో ఓ ఆలోచ‌న వ‌చ్చింది. త‌న గ్రామంలో ఉన్న జ‌ల‌పాతాల‌ను ఈ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌ని అనుకున్నాడు. కానీ అత‌ని వ‌ద్ద డ‌బ్బుల్లేవ్. అస‌లు వారి కుటుంబానికి గానీ,ఈర్లో వారికి గానీ రోజు గ‌డ‌వడ‌మే క‌ష్టం. అటువంటిది ఈ జ‌ల‌పాతాల‌ను వెలుగులోకి తీసుకురావాలంటే చాలా డ‌బ్బు అవ‌స‌రం ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈయ‌న ఆలోచ‌నను గ్రామంలో ఉన్న కుర్రాళ్ల‌తో పంచుకున్నాడు. గ్రామ‌స్తులతో కూడా చెప్పాడు. 15 మంది యువ‌కులు.. అంతా 10వ త‌ర‌గ‌తి, ఇంటర్మీడియేట్ చ‌దువుకున్న‌వాళ్లే. వారంతా ఓ క‌మిటీగా ఏర్ప‌డ్డారు. దానికి అభి అధ్య‌క్షుడిగా ఎన్నికున్నారు. సొంతగా నిధులు సేక‌రించి అర‌కిలోమీట‌రు పాటు మ‌ట్టి రోడ్డు వేశారు. జ‌ల‌పాతాలు చుట్టూ ప‌ర్యాట‌కులు వ‌చ్చేలా వెదురు క‌ర్ర‌ల‌తో వెంతెన‌లు వేశారు. ప్ర‌మాద‌క‌ర ప్రాంతంలో కంచెలు నిర్మించారు. దీన్ని ప్ర‌చారంలోకి తీస‌కొచ్చాక 2013 నుంచి ప‌ర్యాట‌కుల సంఖ్య రావ‌డం ఎక్కువైంది. వ‌చ్చిన వారిని ఆక‌ట్టుకోవాల‌ని ఈ ప‌ర్య‌ట‌క కేంద్రం గురించి అప్ప‌ట్లో మంత్రిగా ఉన్న బాల‌రాజును సంప్ర‌దించారు. ఆయ‌న కూడా ఈ కుర్రాళ్ల చేసిన ప‌నిని అభినందించారు. ఐటీడీఏ అధికారుల‌తో క‌ల‌సి కొత్త‌ప‌ల్లి జ‌ల‌పాతాల‌ను ప‌రిశీలించి అక్క‌డ సుంద‌ర దృశ్యాల‌ను చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. వెంట‌నే ఇక్క‌డ‌కొచ్చే ప‌ర్యాట‌ల‌కు సౌక‌ర్యా కోసం రూ. కోటి నిధులు కేటాయించారు. ఆ నిధుల‌తో బ‌స్సు షెల్ట‌ర్‌, సీసీ రోడ్డు, జ‌ల‌పాతాల వ‌ద్ద మెట్లు, ఇనుప బ్రిడ్జీలు నిర్మించారు. ఆ త‌ర్వాత ఇక్క‌డ సినిమా, సీరియ‌ళ్ల షూటింగులు జ‌రిగాయి. ఇక్క‌డ వారికి ఉపాధి కూడా ల‌భించింది. కుర్రాళ్లంతా చిన్న‌చిన్న షాపులు పెట్టుకుని బ‌తుకుతున్నారు. మ‌హిళ‌లంతా బొంగులో చికెన్‌, చికెన్ పుల్లలు అమ్ముకుంటూ ఊరిలోనే హాయిగా బ‌తికేస్తున్నారు.

కొత్త‌ప‌ల్లి జ‌లపాతాలు – ప్ర‌స్తుతం ఆద‌ర‌ణ పొందుడం వెనుక ఆ గ్రామ యువ‌కులు ప‌డ్డ క‌ష్టం గురించి వివ‌రిస్తున్న యవ‌త‌, జ‌ల‌పాతం రాక‌ముందు వ‌చ్చిన త‌ర్వాత ప‌రిస్థ‌తి గురించి వివ‌స్తున్న క‌మిటీ స‌భ్యు‌లు
కొత్త‌ప‌ల్లి జ‌లపాతాల‌కు ప‌ర్యాట‌లు ఎక్కువ రావ‌డం వ‌ల్ల స్థానిక మ‌హిళ‌లు పొందుతున్న ఉపాధి గురి కువి భాష‌లో వివ‌రిస్తున్న మ‌హిళ‌


కొత్త‌ప‌ల్లి జ‌ల‌పాతాలు చూడ్డానికి రావ‌డం ఎలా?
ఎక్క‌డి వాళ్ల‌యినా మొద‌టి విశాఖ‌ప‌ట్నం రావాలి. అక్క‌డ నుంచి రెండు మార్గాల్లో ఇక్క‌డ‌కి రావ‌చ్చు…
ఒక‌టి… విశాఖప‌ట్నం నుంచి న‌ర్సీప‌ట్నం చేరుకొని అక్క‌డ నుంచి చింత‌ప‌ల్లి వెళ్లే బ‌స్సులో గానీ, వ్య‌క్తిగ‌త వాహ‌నాలు ఉంటే వాటిలో గానీ రావాలి. మొద‌టి జ‌న‌వ‌రిలో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు ఉండే లంబ‌సింగి చేరుకుంటాం. అక్క‌డ అందాలు చూశాక‌ ఆ త‌ర్వాత లోతుగెడ్డ జంక్ష‌న్ నుంచి కుడిచేతివైపు పాడేరు వెళ్లే మార్గం గుండా రావ‌చ్చు. లోతుగెడ్డ జంక్ష‌న్ నుంచి అక్క‌డికి కొత్త‌ప‌ల్లి 25 కి.మి. న‌ర్సీప‌ట్నం నుంచి 60 కి.మి.
రెండోది ….విశాఖ‌ప‌ట్నం నుంచి పాడేరు చేరుకొని అక్క‌డ నుంచి జి.మాడుగుల నుంచి కొత్త‌ప‌ల్లి చేరుకోవాలి. పాడేరు నుంచి 30కి.మి దూరంలో ఈ జ‌ల‌పాతాలు ఉన్నాయి.

ప‌ర్యాట‌కుల కోసం ఏర్పాటు చేసిన వంతెన‌
కొత్త‌ప‌ల్లి జ‌ల‌పాతాల్లో ఒక‌టి
ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేసిన హెచ్చ‌రిక బోర్డు

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *