వికలాంగుల ‘ప్రతిష్ట’ను పెంచేందుకు…!

Spread the love


జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అలాంటి అనుకోని ఘటనలు జరిగినప్పుడు కొందరు నిస్సహాయతతో కుంగిపోతారు. మరికొందరు ధైర్యంగా నిలబడతారు… పోరాడుతారు… మరెందరికో స్ఫూర్తి గా నిలుస్తారు. ఆ కోవకు చెందిన ఓ విద్యార్థిని జీవిత కథ ఇది. అడుగులు పడనీయని సత్తువ లేని కాళ్లను కాదని విద్యనే ఆయుధంగా మలచుకుని ధైర్యంగా ముందుకు సాగుతుందామె. సమాజంలో ఎందరో వికలాంగులకు కొండంత అండగా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇంతకీ ఎవరామె? ఏంటా కథ?

సంకల్పం ఉండాలే కానీ వైకల్యం విజయానికి అడ్డు కాదని నిరూపించింది ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ప్రతిష్టా దే వేశ్వర్. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీకు ఎంపిక అయ్యింది. శారీరక వైకల్యం కలిగి ఆక్స్ఫర్డ్ కు ఎంపికైన మొదటి భారతీయ అమ్మాయి ఈమె. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే అవకాశాన్ని చేజిక్కించుకుంది. సొంతూరు హో షీయాపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆమె ప్రయాణం అంత సులువుగా సాగిపోలేదు. జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమె మనసును మరింత దృఢంగా మలిచాయి. ‘నా పదమూడేళ్ళ వయసులో హోసియాపూర్ నుంచి చండీగడ్ కు వస్తున్నా క్రమంలో మా కారు ప్రమాదానికి గురయింది. ఆ తర్వాత నాకు మెళ‌కువ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. నా పరిస్థితిని చూసి వైద్యులు ఆపరేషన్ చేసేందుకు కూడా వెనకడుగు వేశారు. ఆపరేషన్ చేసేందుకు శరీరంలో రక్తం తక్కువ ఉందని వైద్యులు మ‌ళ్లుగుళ్లాలు పడ్డారు. అలాగని ఆపరేషన్ చేయకపోతే బతికే ఛాన్స్ తక్కువ ఉందని కూడా చెప్పారు. ఆపరేషన్ అయితే జరిగింది కానీ నా కాళ్లు చచ్చుబడిపోయాయి. ఇక నేను జీవితాంతం వీల్ చైర్ లో ఉండాలని వైద్యులు సూచించారు. దాని తర్వాత నాలుగు నెలల వరకూ ఐసీయూలోనూ, ఆ తర్వాత మూడేళ్లు మంచంపైన ఉన్నాను’ అంటూ ఆ రోజులను గుర్తు చేసుకుందామె. అలా మంచం పై ఉంటూనే హోమ్ స్కూల్ లో చదువు కొనసాగించింది. నాలుగు గోడలనే తన ప్రపంచంగా మార్చుకుంది. అలా పదోతరగతిలో 90% ఇంటర్మీడియట్లో 90% మార్కులు సాధించింది.

ఆ కళాశాలే ప్రపంచాన్ని పరిచయం చేసింది
‘శారీరక వైకల్య ప్రభావం నా చదువు పై పడకుండా జాగ్రత్త పడ్డాను. ఎందుకంటే, నేను నిలబడ లేకపోయినా, చదువే నా జీవితాన్ని నిలబెట్టేలా చేస్తుందని తెలుసు. అందుకే ఎలాగైనా చదువును పూర్తి చేయాలనుకున్నాను.ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన తర్వాత నన్ను ఢిల్లీ యూనివర్సిటీలో చేర్పించాలని ఇంట్లో వారిని అడిగాను. ఎందుకంటే, ఈ నాలుగు గోడలకు నా జీవితం పరిమితమవడం నాకు ఇష్టం లేదు’ అంటూ బాహ్య ప్రపంచాన్ని పలకరించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది. అలా ఢిల్లీ లోని శ్రీరామ్ మహిళ కళాశాల లో దరఖాస్తు చేశారు. అక్కడే అడ్మిషన్ పొందింది. ‘ఈ కళాశాల నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. నేనే కాదు నా లాంటి ఎంతో మంది అమ్మాయిల సమస్యలపై స్వరాన్ని వినిపించేలా చేసింది. ఇక్కడకు వచ్చాక నా జీవితం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. అన్యాయాన్ని ఎదిరించడం… దాని కోసం పోరాడడం ఇక్కడి నుంచే నేర్చుకున్నాను. కేవలం కళాశాల లోనే కాదు బయట విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ నా స్వరం వినిపించేలా చేశాను. అలా నా స్వరం దేశవిదేశాల్లోని కంపెనీలు ఆర్గనైజర్ లకు చేరింది. నేను బ్రిటిష్ హై కమిషనర్, హిందుస్థాన్ యూనిలీవర్, యునైటెడ్ నేషన్స్ వంటి ప్రపంచ స్థాయి వేదికలపై మాట్లాడే అవకాశం లభించింది’ అంటూ గర్వంగా చెబుతోందామె.
చదువు కోసం ఢిల్లీ యూనివర్సిటీ కి వెళ్లాలని కుటుంబ సభ్యులను అడిగినప్పుడు చాలా మాటలే ఆమె చెవిన పడ్డాయి. ‘నువ్వు పూర్తిగా ఇతరులపై ఆధార పడుతున్నావు. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లకూడదు’అంటూ ఉచిత సలహాలు ఇచ్చిన వారూ లేకపోలేదు. అలాంటి సందర్భంలో ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరుడు ఎంతగానో ప్రోత్సహించారు. అలా ఆమె ఢిల్లీకి చేరిన తర్వాత వీల్ చైర్ లో ఉన్న వారికి అన్ని సౌకర్యాలు అందించే ప్రదేశాల కోసం అన్వేషణ మొదలు పెట్టింది. కానీ ఎక్కడా అ అలాంటి ప్రదేశం ఆమెకు తారసపడలేదు. మినీ బస్సు లో కానీ క్యాబ్లో కానీ ప్రయాణం చేయడం ఆమెకు కష్టం అనిపించింది. అలా కొన్ని కిలోమీటర్లు వీల్ చైర్‌ లోనే ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించింది. ఈ క్రమంలోనే మన దేశంలో వికలాంగులకు ప్రభుత్వం అందిస్తున్న పాలసీల్లో మార్పులు అవసరమని ఆమె గుర్తించింది.


‘సమాజంలో చాలా మార్పులు తీసుకురావాలి. నేను ఆక్స్ఫర్డ్ లో చదవడానికి కూడా అవే కారణాలు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ లో మాస్టర్ డిగ్రీ చేయాలనుకున్నాను. అది పూర్తయిన తర్వాత మ‌న దేశంలో ఉన్న 2 కోట్ల 68 లక్షల మంది వికలాంగుల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేయాలనుకుంటున్నాను. వీల్ చైర్‌ జీవితం నా కలలకు ఏమాత్రం అడ్డుకాదని అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను’అని అని అన్నారు ప్రతిష్ట. వీల్ చైర్ లో ఉన్నప్పటికీ తన కలలను ఎలా సహకారం చేసుకుందో ప్రపంచానికి చూపించాలి అనుకుంటున్న ప్రతిష్ట ఆశయం ఎందరికో స్ఫూర్తి దాయకం. వికలాంగుల ప్రతిష్టను కాపాడాలని ఆ ఆశయంతో ముందుకు సాగుతున్న ఆమె ప్రయత్నం విజయవంతం కావాలని మనమూ ఆశిద్దాం.

Recommended For You

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *